మరో కురుక్షేత్రం...

రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం..!?

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం పైన పార్టీ హైకమాండ్ కు నివేదికలు వెళ్లాయి. వీటి పైన రాష్ట్ర ఇంఛార్జ్ నుంచి ఏఐసీసీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి నేరుగా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయించారు. ఆ తరువాత పార్టీ నిర్ణయం పైన స్పష్టత రానుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పదేపదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని సమాచారం. తనకు మంత్రి పదవి ఇస్తానని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందని పలు మార్లు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన కంటే జూనియర్ల కు మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో సీఎం రేవంత్ పైన చేసిన వ్యాఖ్యల పైన పార్టీలో చర్చ మొదలైంది. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కాగా, ఈ విషయం పైన టీపీసీసీ క్రమిశిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి రంగంలోకి దిగారు. మల్లు రవి తాజా వివాదం పై రాజగోపాల్ రెడ్డితో మాట్లాడనున్నారు. ఆయన స్పందనకు అనుగుణం గా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఒక దశలో రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డితో మల్లు రవి రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శల గురించి మల్లు రవి వివరణ కోరనున్నారు. ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. పార్టీ పరువును దిగజార్చే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయానికి రానుంది.

నిమిష ప్రియ మరణశిక్షలో బిగ్ ట్విస్ట్

అంతర్జాతీయంగా సంచలనం రేపుతోన్న కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష కేసు అనూహ్య మలుపు తీసుకుంది. ఆమెకు ఊరట లభించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేలింది. ఆమెకు విధించిన మరణ శిక్షను యెమెన్ రద్దు చేసినట్లుగా ఎటువంటి అధికారిక సమాచారం లేదని చెబుతున్నారు. తొలుత- నిమిషా ప్రియా మరణ శిక్షను యెమెన్ రద్దు చేసినట్లు ఇండియన్ గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబుబకర్ ముసలియార్ కార్యాలయం వెల్లడించింది. నిమిషా ప్రియ మరణశిక్షను రద్దు చేయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉందని పేర్కొంది. కాగా- నిమిష ప్రియ కేసు గురించి తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని యెమెన్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం యెమెన్ ప్రభుత్వం తీసుకోలేదని సమాచారం. మరణ శిక్ష రద్దయినట్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలు నిరాధారమైనవని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి. నిమిషా ప్రియ.. కేరళకకు చెందిన మహిళ. పాలక్కాడ్ ఆమె స్వస్థలం. 2008లో ఉపాధి కోసం యెమెన్ వెళ్లారు. అక్కడ మహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించారు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తలాల్ తనను వివాహం చేసుకున్నాడని, వేధిస్తున్నాడని నిమిషా ఆరోపించారు. అంతే కాకుండా పాస్‌పోర్ట్‌ను కూడా లాక్కున్నాడని తెలిపారు. 2017లో తలాల్‌ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మత్తు మందు ఇచ్చి పాస్‌పోర్ట్ తిరిగి తీసుకోవడానికి నిమిషా ప్రయత్నించారని, డ్రగ్స్ డోస్ ఎక్కువ అవడం వల్ల అతను మరణించాడని యెమెన్ అధికారులు తెలిపారు. ఈ కేసులో నిమిషాను అరెస్టు చేసి 2018లో హత్య కేసులో దోషిగా నిర్ధారించారు.

ఆమెకు విధించిన ఉరిశిక్షను అప్పట్లో మే 16న అమలు చేయాల్సి ఉండగా, వాయిదా వేశారు. దీనిపై భారత ప్రభుత్వం తరపున పలు ప్రయత్నాలు జరిగాయి. నిమిషాకు తొలుత జూలై 16న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. 2020లో ఆమెకు మరణ శిక్ష విధించగా, 2023లో ఆమె చివరి అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది.