మరో కురుక్షేత్రం...

బీఆర్ఎస్‌ విలీనంపై తేల్చేసిన కేటీఆర్..!!

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు, బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుంది. తాము ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను తాము ఆపలేదని గుర్తుచేసిన కేటీఆర్, ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో ఎరువుల కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది. పాలు ఇచ్చే బర్రెను పక్కకు పెట్టి దున్నపోతును తెచ్చుకున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక తమ కష్టాలు తీరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విలీనంపై వస్తున్న వార్తలను ఖండిస్తూ, తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ ఎప్పటికీ తెలంగాణ కోసమే పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

ఆ తప్పులు సరిదిద్దాలనే సింగపూర్‌ పర్యటన - సీఎం చంద్రబాబు..!!

గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని సింగపూర్‌ పర్యటనకు వచ్చా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన సింగపూర్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా.. తెలుగు డయాస్పోరా ఫ్రమ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన కొనసాగుతోందని.. సింగపూర్‌ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని కోరారు. టీడీపీ హయాంలోనే మూడేళ్లలో 300 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏపీలో ఏర్పాటయ్యాయని తెలిపారు. ఆనాడు పెద్దఎత్తున ఇంజినీరింగ్‌ కళాశాలల ఏర్పాటుపై చాలా మంది విమర్శించారని.. కానీ ఈనాడు పరిస్థితి ఏంటో అందరికీ తెలుసని అన్నారు.

పీవీ నరసింహారావు ప్రస్తావన..

1991లో పీవీ నరసింహారావు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక దిశను మార్చేశాయని, ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా తెలుగువారు గ్లోబల్ స్థాయిలో శాసించే స్థాయికి చేరారని ఆయన పేర్కొన్నారు.

సింగపూర్‌లో తెలుగు ప్రజల స్థానం..

ప్రస్తుతం సింగపూర్‌లో 40,000 మందికి పైగా తెలుగు ప్రజలు ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో తెలుగువారు సత్తా చాటుతున్నారని చంద్రబాబు గర్వంగా తెలిపారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా అందించడం, రెండు దేశాల మైత్రిని మరింత బలోపేతం చేసిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా తెలుగు ప్రజలు ఉన్నారని, వారు రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ తప్పులపై విమర్శ.. 2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వంపై తప్పు భావన కలిగించారని, ఆ తప్పులను సరిదిద్దేందుకు సింగపూర్ పర్యటన చేస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతింటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, ఈ సందేశాన్ని సింగపూర్ ప్రభుత్వానికి తెలియజేశానని ఆయన తెలిపారు.