మరో కురుక్షేత్రం...

భారత్-పాక్ మ్యాచ్ పై తేల్చేసిన సౌరవ్ గంగూలీ..! కీలక వ్యాఖ్యలు..!

ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ మెగా టోర్నీలో భారత్-పాక్ ఇరుజట్లూ ఒకే గ్రూప్ లో కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడటం ఏంటన్న చర్చ మొదలైంది. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు, రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ కు భారత్ ను పంపుతున్న బీసీసీఐపై శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ఇవాళ మండిపడ్డారు. సైనికుల రక్తం కంటే డబ్బులు ఎక్కువైపోయాయా అంటూ బీసీసీఐ ఆమె ఇవాళ ప్రశ్నించారు. సరిహద్దు తీవ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్ తో క్రికెట్ ఆడటంపై బీసీసీఐ పునరాలోచించుకోవాలని ఆమె సూచించారు. ఇప్పటికే బ్రిటన్ లో వెటరన్స్ క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ తో మ్యాచ్ ను భారత్ బహిష్కరించిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. ప్రియాంక చతుర్వేదీతో పాటు మరికొందరు విపక్ష రాజకీయ నేతలు పాకిస్తాన్ తో భారత్ క్రికెట్ మ్యాచ్ కు మద్దతిస్తుండంటంపై ఏఎన్ఐ వార్తా సంస్థతో గంగూలీ కోల్ కతాలో మాట్లాడారు. ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండటంపై స్పందిస్తూ.. తాను దీనికి ఓకే అన్నారు. క్రీడ కొనసాగాలని, అదే సమయంలో పహల్గామ్ జరగకూడదని, కానీ క్రీడ కొనసాగాలని తెలిపారు. ఉగ్రవాదం జరగకూడదని, దానిని ఆపాలని సూచించారు. ఉగ్రవాదం పట్ల భారతదేశం బలమైన వైఖరి తీసుకుందని, క్రీడ మాత్రం ఆడాలని గంగూలీ కోరారు.

సైనికుల రక్తం కంటే చిల్లర ఎక్కువైందా ? భారత్-పాక్ ఆసియాకప్ మ్యాచ్ పై దుమారం..!

ఈ ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి కారకులైన తీవ్రవాదుల్ని పెంచి పోషించిన పాకిస్తాన్ తో ఆసియాకప్ క్రికెట్ మ్యాచ్ కు భారత్ సిద్దం కావడంపై విమర్శలు మొదలయ్యాయి. ఆసియాకప్ టోర్నీలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆడేందుకు బీసీసీఐ అంగీకరించడంపై పెను దుమారం రేగుతోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలే ఇప్పుడు దీనిపై తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ లో పాకిస్తాన్ తో జరగాల్సిన వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో మ్యాచ్ ను భారత క్రికెటర్లు చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్ తో ఆడేది లేదని భారత సీనియర్ క్రికెటర్లు ఈ మ్యాచ్ ను బహిష్కరించారు. దీంతో చివరి నిమిషంలో ఈ మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు మరోసారి ఆసియా కప్ టోర్నీలో మ్యాచ్ కు బీసీసీఐ ప్లాన్ చేయడంతో దీనిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Virat Kohli

ఉద్ధవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది.. సైనికుల రక్తం కంటే డబ్బులు ఎక్కువయ్యాయంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌ ఎలాంటిదైనా, ఎక్కడ ఆడినా భారతీయులు వ్యతిరేకిస్తారని చెప్పారు. బీసీసీఐ ఈ మ్యాచ్ ను ఏ దేశంలో నిర్వహించినా భారతీయులు మాత్రం వ్యతిరేకిస్తారన్నారు. మ్యాచ్ జరిగే గ్రౌండ్ లో భారతీయులు నిరసన తెలుపుతారని హెచ్చరించారు. భారతీయులు, సాయుధ దళాల రక్తంతో లాభాలు సంపాదించుకోవడం ఆపాలని కోరారు. ఓవైపు భారతదేశ సీడీఎస్ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని చెబుతుంటే, మరోవైపు మీరు మీ రక్త ధనాన్ని సంపాదించడానికి తొందరపడుతున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు.